Fight For Mutton Curry: పెళ్లితో పాటు కొన్ని శుభకార్యాల్లో నాన్‌వెజ్ కోసం గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. మాకు మటన్ సరిగా వడ్డించలేదని.. చికెన్ తగినంత వేయలేదని.. ఇదేనా పెళ్లి కొడుకు తరఫు బంధువులను చూసుకునే విధానం.. ఇదేనా.. పెళ్లి కూతురు బంధువులకు ఇచ్చే మర్యాదా అంటూ.. రకరకాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, తాజాగా నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
Read Also: Viral Video: వామ్మో.. ఇలాంటి వారితో జాగ్రత్త సుమీ..
నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ, మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ.. వడ్డించే వ్యక్తులతో ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.. గాయపడిన ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.