Site icon NTV Telugu

Nama Nageswara Rao : మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోంది

TRS Party Leader Nama Nageswara Rao Fired On Central Government.

టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని 8 సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్నామన్నారు. మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోందని, “నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. మా నోటీసులను అనుమతించక పోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు. కేంద్రం తన వంతు బాధ్యతలను నిర్వహించకుండా విస్మరిస్తోందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. తెలంగాణలో అదనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో “నవోదయ విద్యాలయాలు” ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. మొత్తం 33 జిల్లాలు ఉంటే, గతంలో ఇచ్చిన 9 మినహాయిస్తే కొత్తగా ఒక్కటి కూడా కేటాయించలేదన్నారు. తెలంగాణపై అక్కసుతో పలు విద్యాసంస్థలు, కొత్త మెడికల్ కాలేజీలను మోడీ ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరొక న్యాయం అనే రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. “నవోదయ విద్యాలయాలు” నిర్వహణ సామర్థ్యం (ఫెర్ఫామెన్స్)లో కేరళ తర్వాత తెలంగాణ ఉందన్నారు. దేశంలో కొత్తగా 80 నవోదయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణ కు లేదని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, రాష్ట్ర సమస్యలపై ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేక పోతున్నారని, ఢిల్లీలో మాట్లాడకుండా బీజేపీ ఎంపీలు గల్లీలో గళమెత్తుతున్నారు ఆయన విమర్శించారు.

Exit mobile version