NTV Telugu Site icon

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద..

Srisailam

Srisailam

Srisailam Reservoir: భారీవర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూనే ఉంది.. పైన ఉన్నప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. దీంతో శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు.. సాగర్‌కు వచ్చి చేరుతోంది. సాగర్ సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉండడంతో.. ముందు జాగ్రత్తగా క్రస్ట్ గేట్లు తెరిచేందుకు ప్రాజెక్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా…ఇప్పటికే 584 వద్ద కదలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 290 టీఎంసీల నీరు ప్రాజెక్టులో చేరింది. అయితే, శ్రీశైలం జలాశయానికి వరద కాస్త తగ్గుముఖం పట్టింది.. ఇన్ ఫ్లో రూపంలో.. 3,46,410 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతోంది.. దీంతో.. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు అయితే.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్ల 204.7889 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..

Read Also: Sravana Masam 2024: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ సందడి.. పండుగలు.. శుభ ముహూర్తాలు ఇవే..

ఇక, నాగార్జున సాగర్‌కు ప్రస్తుత ఇన్ ఫ్లో 3,58,041 క్యూసెక్కులుగా ఉంది.. మొత్తం ఔట్ ఫ్లో 3,7485 క్యూసెక్కులు ఉంది.. ఇదే ఇన్ ఫ్లో మరి కొద్దిరోజులు కొనసాగే అవకాశం ఉండటంతో.. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే కుడి కాలువకు 6700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 4600 క్యూసెక్కులు.. జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం 1200 క్యూసెక్కులు, లో లెవెల్ కెనాల్ కు 320 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పత్తి కోసం 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో … నల్లగొండ, సూర్యపేట, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల కు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు. క్రస్ట్ గేట్లను దాటుకొని వెళ్లే నీరు పులిచింతల ప్రాజెక్టు లోకి చేరుకునే అవకాశం ఉండడంతో… ప్రాజెక్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే.. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువల ఆయకట్టు ఖరీఫ్, రబీ పంటలకు ఇబ్బందులు తొలగినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గతేడాది సాగర్ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించగా… గత నెల 23 వ తేదీన 503 అడుగుల వద్ద 120 టీఎంసీల నీటి నిల్వతో ప్రాజెక్ట్ జంట నగరాలకు మాత్రమే తాగునీరు అందించింది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో..తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల ఆయకట్టుకు ఇబ్బందులు తొలగినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.