Inspiration in Eye Donation: తెలంగాణలో అదో చిన్న విలీన గ్రామం. హన్మకొండ జిల్లాలోని హసంపర్తి మండలంలో మారుమూలన ఉంది. అయితేనేం ఆ ఊరి ప్రజల మనసు మాత్రం ఎంతో విశాలం. గ్రామంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబ సభ్యులు మృతుల కళ్ళను దానం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే గ్రామంలో 52 మందికి పైగా నేత్రాలను దానం చేశారు. ఎంతోమంది జీవితాల్లో ముచ్చర్ల గ్రామం వెలుగులు నింపుతోంది. ముచ్చర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఇంజనీర్ మండల రవీందర్ మొదటి నుండి ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి. 2013లో తన తల్లి లక్ష్మి మృతి చెందడంతో ఆమె కళ్ళను దానం చేశాడు. 83 ఏళ్ల తండ్రి చనిపోయినప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగించారు. తమ కుటుంబంతోనే అది ఆగిపోకూడదని ఊరంతటికి వ్యాపించాలని సంకల్పించారు. అలా గ్రామస్తులతో సమావేశమై ఒక మనిషి రెండు కళ్ళను దానం చేస్తే మరో ఇద్దరికి చూపు వస్తుందని అవగాహన కల్పించారు. దీంతో ఆ ఊర్లో నేత్రదాన ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
తాను చేసిన మంచి పనిపై ఊరందరికీ అవగాహన కల్పించేందుకు రవీందర్ కొంతమందిని ప్రోత్సహించారు. ఆ స్ఫూర్తితో ముచ్చర్లకు చెందిన సుజాత రాజమణి స్వప్న రాణి కళ్యాణి నేత్రదానంపై విస్తృతంగా పనిచేస్తున్నారు. ఈ ఊర్లోనే కాక ఇరుగుపొరుగు గ్రామాల్లో బంధువులు స్నేహితులు మృతి చెందిన నేత్రదానం చేయాలని కోరుతున్నారు. ముచ్చర్లలో వీరితోపాటు 74 ఏళ్ల వృద్ధుడు మల్లారెడ్డి ఐదు కుటుంబాల వారితో నేత్రదానం చేయించాడు. ఇలా గ్రామంలో అనేకమంది నేత్రదానంపై స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో మొదటగా తన తమ్ముడు రవీందర్ సహకారంతో తమ తల్లి తండ్రుల నేత్రాలను దానం చేశామని.. అంతటితో ఆగకుండా తన తమ్ముడు తమకు కూడా నేత్ర దానంపై అవగాహన కల్పించి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారని గ్రామానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ సాంబయ్య వెల్లడించారు.
Read Also:YS Sharmila: కేసీఆర్ ఒక గజదొంగ.. దమ్ముంటే అరెస్ట్ చేయండి
గ్రామంలో ఎవరైనా చనిపోయినట్టు తెలియగానే నేత్రదానం చేయాలని ఒక బృందం వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుందని.. కొందరు బాగానే స్పందిస్తున్నా.. కొందరు మాత్రం ఒప్పుకోవడం లేదని.. అయినా తాము మృతదేహం వద్ద రెండు గంటలపాటు ఉండి నేత్రదానం ప్రాధాన్యాన్ని ఓపిగ్గా వివరించి నేత్ర దానం చేసేలా చేస్తున్నామని గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ వివరించారు. మొదటగా తమ ఇంట్లోనుండి తమ నేత్ర దానం చేయించమని.. బంధువుల్లో ఎక్కడా ఎవరు చనిపోయినా వారిని ఒప్పించి నేత్ర దానం చేసేలా చూస్తున్నమని మరో మహిళ రాజమణి చెప్పారు. తాము ఏదైనా మృతదేహం వద్దకు వెళ్లిన అక్కడి వారు నేత్ర దానం కోసం వచ్చారా అని ఇబ్బందికరంగా అడుగుతారని అయినా బాధ పడకుండా నేత్ర దానం ప్రాముఖ్యత వారికి వివరించి నేత్ర దానం చేయిస్తామని పేర్కొన్నారు.
