CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..

  • భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
  • ల్యాండ్ పూలింగ్‌పై పారదర్శక నిబంధనలు
  • ఫేజ్-2 పనులకు త్వరలోనే టెండర్లు
  • పర్యాటక అభివృద్ధిపైనా సీఎం ప్రత్యేక ఫోకస్
Cm Revanth

Cm Revanth

హైదరాబాద్ నగర ప్రక్షాళనతో పాటు ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో హెచ్‌ఎమ్‌డీఏ, జీహెచ్‌ఎమ్‌సీ, ఎంఆర్‌డీసీఎల్ కమిషనర్లు, ఎండీలు , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించిన సీఎం, పనుల్లో వేగం పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

భూసేకరణ వేగవంతం.. ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ల్యాండ్ పూలింగ్‌ విధానంపై పారదర్శకమైన నిబంధనలను రూపొందించుకోవడంతో పాటు ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ , అసైన్డ్ భూముల సేకరణ విషయంలో స్పష్టమైన విధానాన్ని తయారు చేసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఫేజ్-2 టెండర్లు.. పర్యాటక రంగ అభివృద్ధి

మూసీ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని, ప్రాజెక్టుల నిర్మాణానికి అతి తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అంతేకాకుండా టీడీఆర్ (TDR) కేటాయింపులపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రాజెక్ట్‌తో పాటు పరిసర ప్రాంతాల పర్యాటక అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం, మంచిరేవులలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి టెండర్లను తక్షణమే ఆహ్వానించాలని, కొత్వాల్‌గూడా బర్డ్స్ పార్క్‌కు ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.