Mohammad Azharuddin Gives Clarity On Gymkhana Incident: హైదరాబాద్ జింఖానాలో జరిగిన తొక్కిసలాటతో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. అసలు మ్యాచ్ టికెట్స్ అమ్మకాలపై హెచ్‌సీఏకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. టికెట్స్ విక్రయాల బాధ్యతను తాము పూర్తిగా పేటీఎంకే అప్పగించామన్నారు. టికెట్ల విక్రయాలను పేటీఎంకు అప్పగించిన తర్వాత ఇక టికెట్ల విక్రయంతో హెచ్‌సీఏకు సంబంధం ఏముంటుంది? అని తిరిగి ప్రశ్నించారు. తాము టికెట్లను బ్లాక్ చేయలేదని.. బ్లాక్‌లో టికెట్లను విక్రయించారని వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఒకవేళ జింఖాన వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు తమపై కేసులు.. తాము పేటీఎం మీద కేసు పెడతామని అజారుద్దీన్ హెచ్చరించారు. ఒకవేళ తొక్కిసలాటలో తన తప్పు ఏమైనా ఉంటే, తనని అరెస్ట్ చేయమని తేల్చి చెప్పారు. తొక్కిసలాట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. అయితే.. కాంప్లిమెంటరీ టికెట్లు మాత్రం భారీ సంఖ్యలోనే ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఆఫ్‌లైన్‌లో 3 వేల టికెట్లు అమ్ముడయ్యాయని, మిగతా టికెట్లు ఆన్లైన్లో విక్రయించబడ్డాయని క్లారిటీ ఇచ్చారు. ఇక జింఖాన వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పిన అజారుద్దీన్.. గాయపడిన వారికి హెచ్‌సీఏ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో.. హెచ్‌సీఏలో విభేదాలున్న మాట వాస్తవమేనని కుండబద్దలు కొట్టిన సెక్రటరీ విజయానంద్, మ్యాచ్ సక్సెస్ చేయడం కోసం ప్రెసిడెంట్‌తో కలిసి పని చేస్తున్నామని అన్నారు.
ఇదిలావుండగా.. సెప్టెంబర్ 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జరుగుతాయని హెచ్‌సీఏ ప్రకటించింది. దీంతో.. హైదరాబాద్ జింఖానా వద్ద క్రీడాభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే.. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల, భారీ జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.