తెలంగాణలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విధుల కేటాయింపు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సుపరిపాలన సాకారం అవుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం గుర్తింపు కోసం పని చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి ల సహకారంతో జనగామ సమగ్ర అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందన్నారు.
జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సమావేశం జడ్పీ చైర్మన్ భాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ జెడ్పీ సీఈవో జెడ్పిటిసి పలువురు ప్రజాప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన మొదటి రెండున్నర ఏళ్లలో నిధులు సాధించే వరకు సభలో పెట్టనని చేసిన ప్రమాణం మేరకు నిధులు సాధించాకే రెండవసారి శాసనమండలిలో అడుగు పెడుతున్నా అన్నారు.
ప్రజా ప్రతినిధులు నిధులు విధులు సరిగా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి తాను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు, వారు స్పందించి కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి తెప్పించారన్నారు. ఆర్థిక సంఘం నిధులు సరిపోకపోవడంతో ఆ నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు జత చేసి స్థానిక సంస్థలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
గ్రామ పంచాయతీలకు 85 శాతం, మండల పరిషత్ లకు 10శాతం జిల్లా పరిషత్తులకు 5 శాతం నిధులను కేటాయించి ఆయా స్థాయిల్లో అభివృద్ధికి అనేక విధాలుగా సీఎం కేసీఆర్ బాటలు వేశారని ఎమ్మెల్సీ పోచంపల్లి కొనియాడారు. అలాగే స్థానిక సంస్థలకు అదనంగా బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించిన ఘనత కూడా మన సీఎందే అన్నారు. ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవడం లేదని అందుకు తగ్గట్లుగా వచ్చే బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి విజ్ఞాపన అందజేసినట్లు పోచంపల్లి తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులను జడ్పిటీసీ, ఎంపీటీసీ లకు కూడా కేటాయిస్తే మరింత అభివృద్ధికి అవకాశం వుంటుందన్నారు.
జిల్లా కమిటీలలో ఎంపీపీ లకు, జడ్సీటీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో సర్పంచి లాగే ఎంపీటీసీలకు కూడా తగిన గౌరవం దక్కేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు హెల్త్ కార్డ్స్ ఇచ్చేలా, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే విధంగా చూస్తామని పోచంపల్లి హామీ ఇచ్చారు. జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు సీఎం కేసీఆర్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లకు విజ్ఞప్తి చేశాం అని ఆయన వివరించారు.