టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్ రెడ్డిని మరిచిపోలేదని, ఫాం హౌస్లో ఉన్న కేసీఆర్ ను మరిచిపోయారని ధ్వజమెత్తారు.
ఇంద్రవెల్లి సభకు వచ్చే వారిని కొందరు పోలీసులు వ్యక్తిగత ఎజెండాతో అడ్డుకున్నారని, అయినా సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. గాంధీభవన్ లో మాజీ
కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి సీతక్క మీడియాతో మాట్లాడారు.