బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని.. దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటంలేదో హరీష్ రావు చెప్పాలని రఘనందన్ ప్రశ్నించారు. బీజేపీలో పంచాయితీల సంగతి అటుంచి.. ఒకే కుటుంబంలో కేటీఆర్, కవిత పంచాయితీ ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేని హరీష్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ నేతలు లేరని ఎద్దేవా చేశారు.
ఆయన మాట్లాడుతూ, ధనిక రాష్ట్రంలో నిరుద్యోగభృతి ఎందుకు అమలు చేయటంలేదో ఆర్థికమంత్రి చెప్పాలి.. కిషన్ రెడ్డితో మాట్లాడి ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ మంత్రులను స్టడీ టూర్ కోసం బంగ్లాదేశ్ పంపిస్తాం.. కేంద్రం చేస్తోన్న సాయంపై అమరవీరుల స్థూపం వద్ద హరీష్ తో చర్చకు సిద్దం అంటూ తెలిపారు. గతంలో భారతదేశం గురించి మాట్లాడిన కవితకు ప్రజలిచ్చిన తీర్పే హరీష్ రావుకు ఇస్తారు. ప్రజలపై ప్రేముంటే గ్యాస్ సిలిండర్ పై తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తోన్న రూ. 291 రూపాయలను టాక్స్ ను ఎత్తివేయాలి. పెట్రోల్ పై తెలంగాణ ప్రభుత్వం రూ. 27 రూపాయల టాక్స్ ప్రజల కోసం ఎత్తివేస్తోందా? అని రఘనందన్ ప్రశ్నించారు.
హరీష్ కు చిత్తశుత్తి ఉంటే సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలకు ప్రశ్నలకు జవాబు చెప్పాలి.. కేంద్రం సాయం చేయకుంటే ఉచిత కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేదా? కరెంట్ ఇచ్చి ఆడిట్ అడగటం తప్పు ఎలా అవుతోందో హరీష్ చెప్పాలి? గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ కు రైల్వే లైన్ ఎవరిచ్చారో హరీష్ గుర్తుచేసుకోవాలి.. డీఎస్సీ నిర్వహించలేని చేతకానిది టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసిందెవరో హరీష్ రావు చెప్పాలి.. అభివృద్ధిని పరిచయం చేసిందే తానని హరీష్ బాకా ఊదుకోవటం హ్యాస్యాస్పదం అని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు.