Medipally Sathyam : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనార్థం కరీంనగర్ నుంచి కాన్వాయ్‌తో బయలుదేరిన ఎమ్మెల్యే వాహనాలు పూడూరు మలుపు వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై వేగంగా సాగుతున్న కాన్వాయ్‌కు ఎదురుగా జగిత్యాల వైపు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న మూడు ప్రైవేట్ కార్లు వరుసగా వచ్చాయి. ఈ క్రమంలో పూడూరు మలుపు వద్ద కాన్వాయ్‌లోని ఒక కారు అదుపు కోల్పోయి ముందున్న ప్రైవేట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టబడిన కారుతో పాటు దాని వెనుక వస్తున్న మరో రెండు కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి.
IAF AFCAT 2026 Recruitment: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్.. కొడితే లైఫ్ సెట్
కాన్వాయ్‌లో ముందున్న వాహనం ఢీకొట్టడంతో, వెనుక వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందిన మరో రెండు కార్లు బ్రేక్ వేయలేకపోయి ఇప్పటికే ఆగి ఉన్న వాహనాలను వెనుక నుండి ఢీకొట్టాయి. దీంతో మొత్తం ఐదు కార్లు-కాన్వాయ్‌కు చెందిన మూడు వాహనాలు, ప్రైవేట్ కార్లు రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయాణిస్తున్న వాహనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఆయన పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు. అయితే కాన్వాయ్‌లో ఉన్న కొంతమంది సిబ్బందికి, ప్రైవేట్ కారుల్లో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న కొడిమ్యాల పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ధ్వంసమైన వాహనాలను రహదారి నుండి తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, అతి వేగం, అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Cyber Attack : WhatsApp గ్రూపులను టార్గెట్ చేస్తోన్న సైబర్ నేరగాళ్లు