Site icon NTV Telugu

MLA Anirudh Reddy : కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి..

Anirudh Reddy

Anirudh Reddy

MLA Anirudh Reddy : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై, తమ వెనుక కొన్ని శక్తులను ఉంచి నడిపించాయని ఆయన ఆరోపించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించి, రెండో విడత స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.

సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు పార్టీ సింబల్స్ కాకుండా వ్యక్తిని చూసి ఓటు వేస్తారని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థి గత రెండు ఎన్నికల్లో కూడా ఓటమిపాలవడం, ఈసారి ఆ వ్యక్తికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఓటమికి స్వయం విమర్శ చేసుకుంటూ, తాను ఇతర గ్రామాల ఇష్యూస్‌లో ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల, సొంత ఊరే కదా సపోర్ట్ చేస్తారులే అనుకొని కొంచెం నిర్లక్ష్యం జరిగిందేమోనని అనుకుంటున్నానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

రాజాపూర్, నవాబ్‌పేట మండలాల్లోని స్థానిక ఎన్నికల ఫలితాలపై వచ్చిన విమర్శలకు ఆయన బదులిచ్చారు. నవాబ్‌పేట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులు 50 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారని తెలిపారు. చాలా గ్రామాల్లో BRS అసలు అభ్యర్థులనే నిలబెట్టలేదని, గతంలో ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థులను BRS వెనుక ఉండి నడిపించిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, సర్పంచ్ ఎన్నికలలో ఎవరైనా గెలవవచ్చు అని తాను స్టేట్‌మెంట్ ఇవ్వడం వల్ల కొన్నిచోట్ల కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నిలబడటం వల్ల కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని, అయితే ఓవరాల్‌గా కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించిందని నొక్కి చెప్పారు.

రెండో విడత ఎన్నికల కోసం తమ పార్టీ సిద్ధమవుతున్నట్లు అనిరుధ్ రెడ్డి తెలిపారు. మొదటి విడతలో జరిగిన మిస్టేక్స్, ముఖ్యంగా ఒకే స్థానంలో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడటం వంటి లోపాలు రెండో, మూడో విడతల్లో జరగకుండా చూస్తామని, దీని కోసం ఇమ్మీడియట్‌గా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. చివరగా, “గెలిచిన వాళ్లంతా మా వాళ్లే, ఓడిన వాళ్లు కూడా మా వాళ్లే. అన్ని గ్రామాలు నావే” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.

CM Chandrababu: టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు.. 25 వేల మందికి ఉద్యోగాలు..

Exit mobile version