Minister Srinivas Goud Gives Serious Orders To Officials On Double Bedroom Houses Scam: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదే లేదని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికే ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల దందాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారని, అందుకు తాను అభినందిస్తున్నానని అన్నారు. పేదలకు తాము ఉచితంగానే ఇళ్లు ఇస్తున్నామని, దళారుల బారిన పడి ఎవ్వరూ మోసపోవద్దని సూచించారు. డబ్బులతో ఇళ్లు వస్తుందని ఎవరైనా చెప్తే.. అది ముమ్మాటికీ అక్రమమే అవుతుందని చెప్పారు. ఎవరైనా డబ్బులు అడిగితే, వెంటనే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఇళ్ల ఆశతో ఎవరైనా డబ్బులచ్చి మోసపోయి ఉంటే, వాళ్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఫించన్లు సహా పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇతర సంక్షేమ పథకాలన్నీ ఉచితమేనని.. ఎవరైనా డబ్బులు అడిగితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారినై నిఘా పెట్టాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇదే సమయంలో.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో టేప్ మీద వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఎవరైనా అక్రమాలు చేయాలంటే.. హడలి పోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా అమాయకుల్ని దారుణంగా మోసం చేస్తున్న సంఘటనలు ఈమధ్య ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మోసాలు పునారవృతం కాకుండా చూసుకోవాలని సీరియస్‌గా హెచ్చరించారు.