Minister Srinivas Goud Clarity On Fairing In Freedom Rally: హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లో కాల్పులు జరిపిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక మంత్రి అలా ఎలా కాల్పులు జరుపుతారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం మంత్రికి గన్ ఇవ్వడంపై అక్కడున్న పోలీసులపై సీరియస్ అవుతున్నారు. ర్యాలీలో మంత్రికి గన్ ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.
అయితే.. ఈ విషయంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మరోలా స్పందించారు. తనకు ఈ రైఫిల్ స్వయంగా ఎస్పీనే ఇచ్చారని, తానేమీ గుంజుకొని గాల్లో ఫైర్ చేయలేదని వివరణ ఇచ్చారు. పైగా.. అందులో ఉన్నది రబ్బర్ బుల్లెట్ అని క్లారిటీ ఇచ్చారు. కావాలంటే ఉన్నతాధికారుల్ని అడిగి కనుక్కోండని చెప్పారు. స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఇలాంటి కాల్పులు జరపడం సహజమేనని అన్నారు. నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌నని, తానూ చదువుకున్నవాడినని, నిజమైన బుల్లెట్‌తో కాల్చకూడదన్న సంగతి తనకూ తెలుసని పేర్కొన్నారు. తాను కాల్చింది ముమ్మాటికీ రబ్బర్ బుల్లెట్ అని చెప్పిన మంత్రి.. ఒకవేళ అది రబ్బర్ బుల్లెట్ కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు.
తానో క్రీడామంత్రినని, ఇలా కాల్పులు జరపడం తనకు అర్హత ఉంటుందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లా ఎస్పీని అడిగి సరైన సమాచారం తెలుసుకోవాలన్నారు. ర్యాలీ ప్రారంభం కావాలంటే, సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారన్నారు. కాల్పులు ఎప్పుడు జరపాలో తనకు బాగా తెలుసని శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు.