తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో మోసం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్, తెలంగాణకి ప్రతి విషయంలోనూ ద్రోహం చెయ్యడమే బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతి రాష్ట్ర బీజేపీ నేతా, తెలంగాణకు వ్యతిరేకులేనని విమర్శించారు. స్టేట్ బీజేపీ లీడర్లకు దమ్ముంటే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదియ్యాలని సవాల్ విసిరారు కేటీఆర్.
Read Also: Governor: సభలో గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ ప్రకటన.. సొంత ప్రసంగం కాదు..
తాజాగా తెలంగాణలో పర్యటించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం లేదని చేసిన ప్రకటనపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమన్న కేంద్ర మంత్రి ప్రకటన పచ్చి దగా, మోసం అన్నారు. తెలంగాణ ప్రయోజనాల పట్ల స్థానిక బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోచ్ ఫ్యాక్టరీ కోసం నిలదీయాలని సవాల్ చేశారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీ ఒకటని ఆయన గుర్తు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనడానికి రైల్వే మంత్రి ప్రకటన ఒక ఉదాహరణగా పేర్కొన్నారు కేటీఆర్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్), బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదాపై ఇచ్చిన హామీలను వెనక్కి నెట్టి మోడీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు కేటీఆర్.