Site icon NTV Telugu

Minister KTR: రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదు.. వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదు

Ktr

Ktr

Minister KTR: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదని, ఆయన నోట్లో నుంచి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కేసీఆర్‌ ను ఎంతగానో కలిచివేసిందన్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామని తెలిపారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని మండిపడ్డారు. తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదన్నారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు ప్రధానమంత్రి అని ఆరోపించారు. కానీ రాష్ట్ర పునర విభజన హామీ అయినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రం మొండి చేయి చూపించారని మండిపడ్డారు. కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేటలో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని మండిపడ్డారు. ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు? అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? అని అన్నారు. తొమ్మిదేళ్లపాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని మండిపడ్దారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధాన మంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరు అని నిప్పులు చెరిగారు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరని అన్నారు. ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం, ఎవరము హాజరుకామన్నారు.

Read also: Bandi Sanjay: రేపు వరంగల్ కు మోడీ.. అందరూ వచ్చి సభ సక్సెస్ చేయండి

ధరణి విదేశీ చేతిలో ఉందన్న రేవంత్ రెడ్డి గుర్తించాల్సిన మాట కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోట్లోనుంచి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదని మంత్రి మండిప్డారు. ఆయనకు మతిస్థిమితం లేదని సంచలన వ్యాఖ్యలు అన్నారు. ఇది సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయని చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ పైన ఒక మాట ఎందుకు మాట్లాడడు? అని ప్రశ్నించారు. మోడీని బీజేపీని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడని అన్నారు. అందుకే గాంధీ భవన్ లో గాడ్సే దూరిండు అని మేము చెప్పామని అన్నారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి అని అన్నారు. మోడీని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్న వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అని మండపడ్డారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చని తెలిపారు. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ అంశాన్ని ప్రజలే తెల్చాలని కోరుతున్నామన్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని ఆయన అక్కసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలలో భారత రాష్ట్ర సమితి మోడీ మీద బీజేపీ మీద చేసిన విమర్శలలో కనీసం 10% అయినా కాంగ్రెస్ పార్టీ చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే కదా కరీంనగర్ పార్లమెంటును గెలిచింది అని తెలిపారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పని చేసిందని అన్నారు. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. ప్రజలు అమాయకులు కాదు.. ఎవరును మోడీని వ్యతిరేకించి, గట్టిగా నిలబడి కొట్టగలరో ప్రజలందరికీ తెలుసు అని మంత్రి కేటీఆర్ అన్నారు. మోడీ పైన తలవంచకుండా పోరాటం చేసే వ్యక్తి ఎవరో దేశ ప్రజలందరికీ కూడా అవగాహన ఉందని అన్నారు. అందుకే మహారాష్ట్ర లాంటి చోట కూడా కేసీఆర్ పర్యటనలకు మంచి స్పందన వస్తుందని కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో కూడా మహాకూటమి పేరు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ప్రజలు వీపు పగలగొట్టి వెనక్కి పంపించారని వ్యంగాస్త్రం వేశారు. పేదవారి గుండెల్లో కేసీఆర్ ఉన్నారు.. ఆయనను తిరిగి మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

నాలుగేళ్ల కింద మోడీని పచ్చి బూతులు తిట్టిన చంద్రబాబునాయుడు ఎన్డీఏ మీటింగ్ హాజరు ఎట్లా అవుతాడు? అని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మోడీ చేసిన మేలు ఏమిటో చంద్రబాబు చెప్పాలి అని ప్రశ్నించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఆంధ్ర, తెలంగాణకు మోడీ చేసిన మేలు ఏమిటో చెప్పి హాజరు కావాలని డిమాండ్ చేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ దేశానికి ఏం చేసిండో అదైనా చెప్పాలి? అని డిమాండ్ చేశారు. అసలు రాహుల్ గాంధీని దేశంలో ఎవరు లీడర్ గా గుర్తిస్తున్నారో చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్. పార్టీ అధ్యక్షుడు కాదు… పార్టీ ఎంపీ కూడా కాదు… ఏ హోదాలో ఆయన హామీలు ఇచ్చిండో చెప్పాలని అన్నారు. హోదాలేని నాయకులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. 55 సంవత్సరాల పాటు తెలంగాణను రాబందులలా వేధించుకొని తిన్న కాంగ్రెస్ పార్టీ… రాహుల్ గాంధీ ముత్తాత నుంచి రాహుల్ దాకా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. పాత రాబందులు నేడు బహురూపు వేషాల్లో మళ్లీ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు.
Jawan : వైరల్ అవుతున్న నయన్ లుక్..

Exit mobile version