ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దక్షిణాదిలో బీజేపీ లేదని ఆయన అన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉందా అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏదో పొరపాటున 4 ఎంపీ సీట్లు గెలిచారన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ చిల్లర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని, కాంగ్రెస్ కూడా పరిమితమైన ప్రాంతీయ పార్టీయే అన్నారు.
టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీలు ఉంటే.. కాంగ్రెస్‌కు 55 మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో కొత్తదనమైన నాయకత్వం లేదని, కాంగ్రెస్ అంటే ప్రజలకు కూడా ముఖం మొత్తిందన్నారు. జాతీయ రాజకీయాల్లో 2014 ముందు నరేంద్ర మోడీ కేవలం గుజరాత్ ముఖ్యమంత్రిగా మాత్రమే తెలుసునని, కానీ.. ఎన్నికల ముందు గుజరాత్‌లో ఏదో చేశామని గోల్‌మాల్ చేసి దేశ ప్రజలను మభ్యపెట్టారన్నారు. తెలంగాణలో అమలవుతున్న అన్ని పథకాలతో గోల్డెన్ తెలంగాణ అవతరించిందన్నారు.
8 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయంలో ఎన్నో మార్పలు తీసుకువచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టగలిగిందన్నారు. అంతేకాకుండా ఇంటింటికీ త్రాగునీరు, 6 దశాబ్దాల కరెంటు సమస్యను పరిష్కరించిందన్నారు. ఇదే తరహాలో మిగితా రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నాయనే సవాల్‌ను ప్రజల ముందు పెడుతామన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటే ఏమైనా జరుగోచ్చు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.