NTV Telugu Site icon

Konda Surekha: గత ప్రభుత్వ నేతల ఆస్తులపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుంటుంది

Konda Surekha

Konda Surekha

వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలన్నింటిని అమలు చేసి తీరుతామంటున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయ భూముల కబ్జాపై ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గిరిజనుల సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మహా జాతరను మంత్రి సీతక్కతో కలిసి తాను విజయవంతం చేస్తామన్నారు. ఇక ప్రభుత్వం ఇచిన్న శ్వేతా పత్రం పైనా వివాదాస్పదం చేస్తున్న టీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వ ప్రధాన నేతల ఆస్తులపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు వారి ఆస్తులు ఎంత.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన అనంతరం వారి ఆస్తుల వివరాలపై కూడా శ్వేతా పత్రం విడుదల చేస్తే బాగుంటుందన్నారు.