NTV Telugu Site icon

Harish Rao: మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. పట్టణాల్లో 500 బస్తీ దవాఖానాలు..

Minister Harish Rao

Minister Harish Rao

Minister Harishrao: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. జూన్ నాటికి పట్టణాల్లో 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలో 350 బస్తీ దవాఖానలు, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలను తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తుండగా, మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయని, వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ నెలాఖరు నాటికి మరో 80 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి 3,206 గ్రామీణ దవాఖానలను పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. దవాఖానలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయని, డిస్పెన్సరీ సమయాలు, వైద్యుల ఫోన్ నంబర్లు, అందించే వైద్య సేవలు, పరీక్షల గురించి ప్రజలకు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

Read also: ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి అస్సలు తినకూడదు

గ్రామీణ దవాఖానల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా బస్తీ దవాఖానలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. బస్తీ దవాఖానలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీనియర్‌ డాక్టర్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. గ్రామీణ దవాఖానల్లో ఖాళీగా ఉన్న 321 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వాలని సూచించారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయగా 12 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో కంటి అద్దాల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. దవాఖానల ఏర్పాటు, కంటి వెలుగు కార్యక్రమంపై ఇటీవల వైద్యశాఖ అధికారులతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్స్ నూతన భవనం, వరంగల్ హెల్త్ సిటీ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు