NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణలో బీజేపీ ఫెయిల్.. టీఆర్ఎస్ పాస్

Harish

Harish

నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా దవాఖానాకు , రూ.కోటి వ్యయంతో టీ డయాగ్నస్టిక్ హబ్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు .

నారాయణపేట జిల్లాలో ఒకనాడు 50 పడకల ఆసుపత్రి కూడా లేదన్న హరీశ్ .. ఇవాళ 390 పడకల మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు . మహబూబ్ నగర్ లో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేదన్నారు. నాగం, డీకే అరుణ ఈ జిల్లా మంత్రులుగా ఉండి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఏడేండ్లలో తెలంగాణలో మెడికల్ కాలేజ్ ల సంఖ్య 33 కి పెంచామన్నారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే సాధ్యం అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే నర్సింగ్ కళాశాల ఏర్పాటు అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు.

read also:

Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి

మెడికల్ కాలేజీ కోసం భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి …పరిహారం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరు పని చేస్తారో ప్రజలు గమనించాలని పేర్కొన్న హరీశ్.. బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ జిల్లాలో పాదయాత్ర చేశారని విమర్శించారు. పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. అక్కడ ఆరు గంటల కరెంట్ కూడా లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అయిందని …టీఆర్ఎస్ పాస్ అయిందన్నారు.

తెలంగాణలో వడ్ల కుప్పల దగ్గర లొల్లి పెడుతున్న బీజేపీ నేతలు.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఎందుకు కొనట్లేదో సమాధానం చెప్పాలన్నారు. ఏది అడిగితే అది ఇస్తాం అంటున్న బీజేపీ, కాంగ్రెస్ లు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ , మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.