Minister Harish Rao Fires On BJP and Congress Party: తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మస్తు మాట్లాడుతారని.. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు దోచుకుంటే, ఇప్పుడు బీజేపీ పెద్దలకు పెట్టి పేదల్ని ముంచుతోందన్నారు. మెదక్ జిల్లాలోని పిల్లి కొట్టాలలో 564 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన హరీష్ రావు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవ్వరు ఇలా ఇల్లులు కట్టి పేదలకు ఇవ్వలేదని, పేదలకు ఇల్లు ఇచ్చింది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు భారీ మొత్తం దోచేసుకున్నారని ఆరోపించిన ఆయన.. అప్పట్లో పేదోళ్లకు ఇల్లు రాలేదు కానీ, కాంగ్రెస్ వాళ్లు మాత్రం పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు.
బీజేపీ వాళ్లు సైతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ ఉచితాలు బంద్ చేయమంటోందని.. ఉచితాలు బంద్ చేయమన్న ఆ బీజేపీని మనం రద్దు చేయాలని పిలుపునిచ్చారు. పెద్దలకు పెట్టేవాళ్ళెవరో, పేదలకు పెట్టె వెళ్లేవారు ఆలోచించాలన్నారు. ఒకడు హిందు-ముస్లిం కొట్లాట పెట్టి.. ఓట్లు కొట్టుకోవాలని చూస్తాడని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై సెటైర్లు వేశారు. వాళ్లను కోసిన, మనకు కోసినా వచ్చేది రక్తమేనని కౌంటర్ వేశారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన బీజేపీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచిన బీజేపీ.. మీ బ్యాంక్లో డబ్బులు వేస్తామని చెప్పి, ఇప్పుడు సబ్సీడీ ఎత్తేసిందని అన్నారు. ఇది జూటేబాజ్ బిజెపి పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల కోట్లు కంపెనీకి మాఫీ చేసే బీజేపీ.. సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. బాయి కాడ మీటర్ పెట్టమని బీజేపీ చెప్పిందని, కానీ తాను పెట్టేదే లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని హరీష్ రావు వెల్లడించారు.