Minister Harish Rao criticizes BJP: బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. ఈనెల 18న ఖమ్మంలో టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం ఇల్లందులో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బీజేపీలో చేరితే వారు రాజకీయాలకు దూరం అయిపోయినట్లే అని, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ప్రజలు ఎలాంటి అవకాశాలు ఇవ్వరని అన్నారు.
Read Also: Aaditya Thackeray: మరో 2 నెలల్లో ద్రోహుల ప్రభుత్వం కూలిపోతుంది..
దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దరాని అన్నారు. మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మీ, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టారని.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఓ వైపు పండగా, మరో వైపు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఖమ్మంలో జరిగే కేసీఆర్ సభకు 5 లక్షల మంది వస్తారని అన్నారు. కేసీఆర్ సత్తా ఏంటో మనం చూపించాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. సభకు జాతీయ నాయకులు వస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ తల్లిలాంటిదని పేర్కొన్నారు.
బీజేపీ టార్గెట్ గా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బీజేపీలోకి ఎవరైనా వెలితే పట్టగతులు ఉండవని అన్నారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎల్ఐసీ, రైల్వేని అమ్ముకున్నారని.. సింగరేణిని కూడా అమ్మేస్తారని, దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లాని, జాతీయ స్థాయిలో తెలంగాణ నాయకత్వం వహించనుందని వెల్లడించారు.