మరోసారి రాష్ట్రంలోని బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేంద్ర నాయకత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాలను అభినందిస్తుంటే.. గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. మమ్మల్ని పొగుడుతున్న కేంద్ర నాయకత్వాన్ని ఇక్కడి బీజేపీ నాయకులు తిట్టాలి అంటూ సలహా ఇచ్చారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి షెకావత్.. మిషన్ భగీరథను అభినందించారని గుర్తుచేశారు.. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు, అధికారులను సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు.
Read Also: Kishan Reddy: పీకేని కేసీఆర్ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!
ఇక, మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడం గర్వకారణం అన్నారు మంత్రి ఎర్రబెల్లి.. అందరి కృషితోనే మిషన్ భగీరథ విజయవంతమైందన్న ఆయన.. పల్లె ప్రగతి పనుల వల్లే 14 కేంద్ర అవార్డులు వచ్చాయన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాగునీటి కోసం మహిళలు ఎన్నో కష్టాలు పడేవారు.. బిందులు తీసుకుని కొన్ని కిలోమీటర్లు నడిచేశారు.. ఏ నీరు దొరికితే ఆ నీటినే తాగే పరిస్థితి ఉండేదని గుర్తుచేసిన మంత్రి.. ఇప్పుడు ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.. మరోవైపు.. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని తెలిపారు. అన్ని పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తుందని కొందరు అంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఎంత ఇస్తే అంత డబ్బులు రాష్ట్రం ఇస్తుందని గుర్తుచేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.
