Site icon NTV Telugu

Asaduddin Owaisi: బాబ్రీ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బాబ్రీ మసీద్ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ది జూటా సెక్యులరిజం అని దుయ్యబట్టారు. ముస్లింలు మందిరాలను కూల్చివేశారని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీది కేవలం పొలిటికల్ సెక్యులరిజం అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 11 సార్లు కర్ఫ్యూ విధించారని, కేసీఆర్ హయాంలో రెండుసార్లు కర్ఫ్యూ విధిస్తే, అందులో ఒకసారి కరోనా సమయంలో అని అన్నారు. 2014 నుంచి అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తుందని, ఈ సారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, దీంట్లో ఎటువంటి డౌట్ లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకే మా పూర్తి సపోర్టు ఉంటుందని స్పష్టం చేశారు.

Read Also: CM KCR: ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారు.. ఆలోచించి ఓటు వేయండి

అజారుద్దీన్ తో నాకు సంబంధం లేదని, ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అని, అజారుద్దీన్ సోదరులు నా స్నేహితులని అసద్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని, ఎంఐఎం గెలుస్తుందని తెలిపారు. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఇప్పుడు బీసీ సీఎం అంటున్నారని బీజేపీని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యాం సేఫ్టి అథారిటీ ఇచ్చిన నివేదిక చదవలేదని, మరమ్మతులకు అయ్యే ఖర్చు నిర్మాణ సంస్థ భరిస్తుందని కేటీఆర్ చెప్పారని, రాష్ట్ర ఖజానాపై ఎలాంటి నష్టం ఉండదని ఓవైసీ వ్యాఖ్యానించారు.

అంతకు ముందు రోజు ఎంఐఎం, బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించడంపై అసదుద్దీన్ స్పందించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఓడిపోవడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నానని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 2014, 2019లో ఓడిపోవడానికి మీరు బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారా.? అని అడిగారు.

Exit mobile version