Meenakshi Natarajan Sarvodaya Sankalp Padayatra at Medak District.
భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలను, రైతులను కలుస్తున్నామని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. భూదానోద్యమం తెలంగాణలో ప్రారంభమయ్యి దేశ వ్యాప్తంగా విస్తరించిందని, లక్షలాది పేద ప్రజలకు భూదానోద్యమం వల్ల మేలు జరిగిందని ఆమె వెల్లడించారు.
చాలా మంది వామపక్ష భావజాలం ఉన్న సంస్థలు, నక్సలైట్లు బలవంతంగా భూములను పేదలకు పంచి పెట్టారు. కానీ అహింసా పద్ధతుల్లో లక్షలాది ఎకరాలు పంచిన ఘనత వినోభాభావేది అని ఆమె తెలిపారు. తెలంగాణలో ధరణి ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మా పాదయాత్ర లో తెలిసిందని, పాదయాత్ర ముగిసిన తర్వాత తిరిగి తెలంగాణ వస్తాను, ధరణి సమస్యలపై తెలంగాణ రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఆమె వెల్లడించారు.