Site icon NTV Telugu

Medaram 2026 : సమ్మక్క -సారలమ్మ జాతరకు 4 వేల బస్సులు

Apsrtc

Apsrtc

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఒక్క హుస్నాబాద్ డిపో నుండే మేడారానికి 50 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎవరూ ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు.

IED Blasts : మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టలు..!

ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత సురక్షితమైనదని, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సులకు ఒక ప్రత్యేక సౌకర్యం ఉందని మంత్రి వివరించారు. భక్తులు నడక సాగించే అవసరం లేకుండా, నేరుగా అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లగలిగే రవాణా సౌకర్యం కేవలం ప్రభుత్వ బస్సులకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ వాహనాలలో రద్దీ , ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రజలు ఆర్టీసీని ఎంచుకోవాలని కోరారు. జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే క్రమంలో చిన్న పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ , ఆర్టీసీ సంయుక్తంగా ఒక వినూత్న చర్య చేపట్టాయి.

జాతరకు వచ్చే ప్రతి చిన్న బిడ్డ చేతికి పేరు , తల్లిదండ్రుల ఫోన్ నంబర్ నమోదు చేసిన ఒక ప్రత్యేక బ్యాండ్‌ను కడతారు. ఒకవేళ రద్దీలో పిల్లలు తప్పిపోయినా, ఈ బ్యాండ్ ఆధారంగా వారిని వెంటనే తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి వీలవుతుంది. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. హుస్నాబాద్ నుండి ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు జాతర ముగిసే వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.

T20 World Cup: సొంత ఆటగాళ్లనే మోసం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్..

Exit mobile version