Raghunandan Rao : మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి భారీగా రూ.1119 కోట్ల రక్షణ ఆర్డర్ లభించింది. ఈ విజయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తన కృషి ఫలితమని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బలోపేతం కోసం తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి నిరంతరం కృషి చేస్తున్నానని రఘునందన్ రావు గుర్తు చేశారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి, సమస్యలపై కేంద్రానికి విజ్ఞప్తులు సమర్పించిన విషయాన్ని ఆయన వివరించారు.
Hyderabad Rains : కొట్టుకుపోయిన పునాది.. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు.!
అలాగే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి సంజయ్ సేథ్‌లను అనేకసార్లు కలసి ప్రతిపాదనలు సమర్పించానని తెలిపారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున ఆర్డర్ మంజూరు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ ఆర్డర్ వల్ల ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారని రఘునందన్ రావు అన్నారు. మెదక్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని, పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగానికీ సమాన ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.