Mallu Ravi Fire on Sangareddy Collector: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అనడంపై తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దీంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ ఎలా అవుతారని కాంగ్రెస్ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. ఒక ఐఏఎస్ అధికారి ఇలా మాట్లాడటం అంబేడ్కర్‌ను అవమానించడమే అవుతుందని అన్నారు.
కలెక్టర్ శరత్ కు మల్లురవి ప్రశ్నల వర్షం:
* అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పినందుకే ఇలా పొగిడారా?
* రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన గిరిజన రిజర్వేషన్లు 8 ఏళ్లుగా ఇవ్వకుండా ఆపి గిరిజనులకు తీవ్ర నష్టం చేసిన కేసీఆర్ ఏ విధంగా అభినవ అంబేద్కర్ అవుతారు?
* రాష్ట్రంలో ఎన్నికల ముందు దళితులకు, గిరిజనులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వనందుకు అభినవ అంబేద్కర్ అయ్యారా?
* కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరును మార్చి ఆ మహానుభావుడిని అవమానపరిచినుందుకా?
* దళితుడిని సీఎం చేస్తానని, చెయ్యకపోతే తల నరుక్కుంటానని హామీ ఇచ్చి మోసం చేసినందుకు కేసీఆర్ అభినవ్ అంబేద్కర్ అయ్యారా?
* కాంగ్రెస్ ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేయాల్సి నిధులను 62 వేల కోట్లు క్యారీ ఫర్వార్డ్ చేసి ఆ ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసినందుకా.. ?
ఎందుకు కేసీఆర్ అభినవ అంబేద్కర్ అయ్యారో ఐఏఎస్ ఆఫీసర్ శరత్ చెప్పాలని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల్లాగా ఉన్నత పదవుల్లో ఉండే వారు కూడా ఇలా మాట్లాడితే ఇక ప్రజలకు సేవలేం చేస్తారు? అంటూ మండిపడ్డారు. కలెక్టర్ వెంటనే తన మాటలను ఉపసంహరించుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పై కలెక్టర్ శరత్ ఈ కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అభినవ అంబేద్కర్, నేను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని చూడలేదు.. సీఎం కేసీఆర్ రూపంలో ఇప్పుడు చూస్తున్నాం అంటూ తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ శరత్. ఆనాడు అంబేద్కర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అన్ని అంశాలు పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించారు.. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచారు…గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం పై సంతోషంగా ఉంది.. దేశ చరిత్రలో ఒక సంచలమైన నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం…భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని సంచలన నిర్ణయం తీసుకున్నారు..గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు.. నేనూ ఒక గిరిజన బిడ్డనే అని కలెక్టర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.