తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్‌పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 2 రోజుల టూర్ ఖరారు అయ్యిందని, రైతు సంఘర్షణ సభ పేరుతో రాహుల్ సభ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రైతు రుణ మాఫీ, రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రైతులు నష్ట పోతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అని చెప్పి…ఇప్పటికీ సాయం అందించలేదని ఆమె మండిపడ్డారు. రైతులు రాహుల్ గాంధీ సభకు రావాలని కోరుతున్నామన్నారు.