Lotus Pond Land Auction: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత! అమ్మకానికి వేల కోట్ల భూమి..

Lotus Pond Land Auction

Lotus Pond Land Auction

Lotus Pond Land Auction: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఏరియా జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే పార్క్ స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టడమే కాకుండా, భారీ పోలీసు బందోబస్తు మధ్య పనులు మొదలుపెట్టడంతో స్థానికులు భగ్గుమన్నారు. పార్క్‌లో ఉన్న విలువైన చెట్లను నరికేసి, జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తుండటంతో కాలనీవాసులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ వివాదంపై స్థానికులతో కలిసి పోరాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి యోగానంద్, ప్రభుత్వం తీరుపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ నెల 24న ప్రధాన దినపత్రికల ఫ్రంట్ పేజీలో ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చిందని, అందులో లోటస్ పాండ్ వద్ద ఉన్న సుమారు 10,150 గజాల స్థలాన్ని వేలం వేస్తున్నట్లు పేర్కొందని తెలిపారు. నిజానికి గతంలోనూ ప్రభుత్వం ఈ భూమిని అమ్మేందుకు ప్రయత్నించగా, తాము కోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఈ స్థలాన్ని కేవలం పార్క్‌గా మాత్రమే అభివృద్ధి చేస్తామని న్యాయస్థానానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని యోగానంద్ చెప్పారు.

కోర్టుకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి ఇప్పుడు మళ్లీ వేలానికి సిద్ధమవడమే కాకుండా, ప్రకటనలో తప్పుడు వివరాలు ఇచ్చారని యోగానంద్ మండిపడ్డారు. ఈ స్థలానికి 40 గజాల రోడ్డు ఉందని ప్రకటనలో చూపించారని.. కానీ అక్కడ అసలు రోడ్డే లేదని, ఇప్పుడు స్థలాన్ని చదును చేసి కొత్తగా రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందని ప్రకటనలో రాశారని, కానీ వాస్తవానికి లోటస్ పాండ్ నుంచి వచ్చే అదనపు నీరు నేరుగా ఈ స్థలంలోకే వచ్చి నిలుస్తోందని అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టారు. వేల కోట్ల విలువ చేసే పార్క్ భూమిని కమర్షియల్‌గా మార్చి అమ్మేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని స్థానికులు తేల్చి చెబుతున్నారు. పోలీసుల పహారా మధ్య సాగుతున్న ఈ పనులపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక వివాదం మరింత ముదురుతుందా అనేది చూడాలి.