తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అటవీశాఖ అధికారులు.
ఇంతకుముందు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ చిరుతలు కలకలం రేపాయి. రోడ్లమీదకు చిరుతలు రావడంతో అటు వైపు వెళ్ళడానికే రైతులు భయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా సుద్దులంలో ఓ చిరుత బండరాయిపై కూర్చున్న ఫోటోలు కలకలం రేపాయి. చిరుతలు గొర్రెల మందపై దాడిచేయడంతో గొర్రెల కాపరులు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చిన గొర్రెలు చనిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు.