ఈటల ఎపిసోడ్ తో టీఆర్ఎస్ లో పెద్ద అలజడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈటల టీఆర్ఎస్ ను వీడటంతో.. ఆయన స్థానాన్ని మరో బీసీ నాయకుడితో భర్తీ చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి రమణ వెళుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అనుమానాన్ని నిజం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణ పై పార్టీ శ్రేణులతో ఎల్ రమణ చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో తెరాసలో చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. తనతో పాటు పార్టీ క్యాడర్ ను కూడా టీఆర్ఎస్ లోకి తీసుకుపోవడానికే ఎల్ రమణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.