2009, డిసెంబర్ 9కి తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. అప్పటికే ఆయన దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సంఘటన జరిగి 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కేటీఆర్.. కేసీఆర్ దీక్షపై వచ్చిన ఓ పేపర్ క్లిప్పింగ్‌ను ట్వీట్ చేస్తూ.. ఆ ట్వీట్‌లో ఇలా రాశారు. ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నెండేండ్లు.. జై కేసీఆర్.. జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
