KTR : హైడ్రా సంస్కరణ కాదు.. అరాచక సంస్థ.. కేటీఆర్ ఫైర్

  • హైడ్రా అరాచక సంస్థ అంటూ కేటీఆర్ విమర్శలు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, రాష్ట్ర అప్పులపై వివరణ
  • కాజీపేట రైల్వే డివిజన్‌కు కేంద్రాన్ని కోరిన కేటీఆర్
  • ఉద్యోగాలపై మోదీ, కాంగ్రెస్‌లను ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నేత
Ktr

Ktr

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: ‘హైడ్రా’ అరాచక సంస్థ, అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తాం!
హైడ్రా (HYDRAA) వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి కేసులు పెట్టేది, దాడులు చేసేది తమపైనేనని మండిపడ్డారు. బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి కాపాడారని, ఎవరికి ఎవరు రహస్య మిత్రులో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా రేవంత్ రెడ్డితో తాము నిరంతరం తలపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

హైడ్రా ఒక బ్లాక్‌మెయిల్ టూల్..  

హైడ్రా అనేది సంస్కరణ కాదని, అదొక అరాచక సంస్థ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బిల్డర్లను బ్లాక్‌మెయిల్ చేయడానికి, ఆర్ఆర్ టాక్స్ పేరుతో డబ్బులు గుంజడానికి రేవంత్ రెడ్డి హైడ్రాను ఒక టూల్‌లా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వసూలు చేస్తున్న ఈ డబ్బులు చివరకు బిఆర్ఎస్ , కాంగ్రెస్ ఖాతాలకే వెళ్తున్నాయని విమర్శించారు. సీఎం సోదరుడి ఇల్లు, ఇతర మంత్రుల ఇళ్లు చెరువుల్లో ఉన్నప్పటికీ వాటిని ముట్టడం లేదని, కేవలం పేదలనే హైడ్రా టార్గెట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అన్నదమ్ములే పెద్ద కబ్జాకోరులని, భూమిని భూహరతిగా మింగేస్తున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, చట్టానికి ఎవరూ మినహాయింపు కాకూడదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తెచ్చే ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని, తాము అధికారంలోకి వచ్చాక హైడ్రాను బంగాళాఖాతంలో పడేస్తామని తేల్చి చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, అప్పులపై స్పష్టత

2014లో బీఆర్‌ఎస్  అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఆనాడు తాము రూ. 72 వేల కోట్ల అప్పులతో పాలన మొదలుపెట్టి, రూ. 2 లక్షల కోట్ల వరకు అప్పు చేశామని, అయితే దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో ఆస్తులను కూడా భారీగా పెంచామని వివరించారు. కొత్తగా భవనాలు లేదా ఇళ్లు ఏవీ నిర్మించకుండా, కేవలం పేర్లు మార్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు.

కేంద్ర మంత్రితో భేటీ – రైల్వే, ఐటీ రంగాల వినతులు

రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల బాగుగోళ్లే తమకు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. సౌత్ రైల్వే జోన్ పునర్విభజనలో భాగంగా వరంగల్ ప్రజల సుదీర్ఘ కోరిక అయిన కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్-కరీంనగర్ (మనోహరాబాద్-కొత్తపల్లి) లైన్‌లో సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తయిందని, మిగిలిన 75 కిలోమీటర్ల లైన్‌ను త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్లే ఈ పనులు ఆగాయని, ఈ ప్రాధాన్యత గల లైన్‌కు నిధులు ఇవ్వాలని కోరారు. దీనితో పాటు సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను ‘అమృత్ స్టేషన్లు’గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

ఐటీ రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలో ద్వితీయ శ్రేణి నగరాల్లోని 10 ప్రాంతాల్లో నిర్మించిన ఐటీ హబ్‌లు నేడు కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల భూత్ బంగ్లాల్లా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఐటీ ఉద్యోగాల వృద్ధి మందగించిందని, తమ పాలన ముగిసేనాటికి ఉన్న ఉద్యోగాల్లో దాదాపు 7,000 ఉద్యోగాలు తగ్గాయని తెలిపారు. వరంగల్‌లో ‘ఇండియా AI డేటా సెంటర్’, కరీంనగర్ , ఖమ్మంలో సైబర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు.

దేశవ్యాప్త యువత నిరాశ, ఉద్యోగాలపై ప్రశ్నలు

ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా దేశంలో యువత తిరుగుబాటు జెండా ఎగురవేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, మరి గత 12 ఏళ్లలో రావాల్సిన 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడపోయాయని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసమర్థత వల్లే యువత ఆందోళనలను సరిగ్గా అడ్రస్ చేయలేకపోయిందని, ఆన్‌లైన్‌లో మొదలైన ఉద్యమం చివరికి ఉద్రిక్తంగా మారిందని అన్నారు. దేశంలోని యువతలో ప్రస్తుతం తీవ్ర నిరాశా నిస్పృహలు నిండి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.