Site icon NTV Telugu

KTR : తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరాన నిండి ఉంది

Ktr

Ktr

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ…బిజెపి చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు

Harish Rao : తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతారా.?

తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువకుల బలిదానాల ఫలితంగా ఈ గడ్డ విముక్తి పొందిందని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని దేశ విభజన లాంటి విషాదకర సంఘటనలతో పోల్చడం ద్వారా బీజేపీ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు.

QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

పార్లమెంటు సాక్షిగా తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా, అక్కడే ఉన్న ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అత్యంత సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కనీసం తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం బిజెపి ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం దారుణం అన్నారు. తమ కళ్ల ముందే తెలంగాణను అవమానిస్తున్నా అడ్డుకోలేకపోయిన వీరు, ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఈ ఎంపీల వైఖరిని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు బిజెపి పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలే బిజెపి అధికారిక విధానంగా భావించాల్సి వస్తుందన్నారు.

Exit mobile version