Site icon NTV Telugu

KTR : జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ విజయయాత్ర ప్రారంభం కావాలి

Ktr

Ktr

KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు.

పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్, “కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలి” అని పిలుపునిచ్చారు. “జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్లీ గెలవడం ఖాయం. కానీ మెజార్టీ ఎంత అనేది మన చేతిలో ఉంది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నియోజకవర్గంలో దివంగత మాగంటి గోపీనాథ్ ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడం బాధాకరం. కానీ ఇప్పుడు ఆయన స్ఫూర్తితో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి, కారు గుర్తుకే ఓటేయండి” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

అంతేకాకుండా.. “హిట్లర్ నశించడాన్ని చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడదు. జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇళ్లు కూల్చడమా? ఒకప్పుడు ఇందిరమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నాడు” అని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ ఒక్క నియోజకవర్గం కాదు, ఒక కుటుంబం. నా భర్త గోపీనాథ్ ఎప్పుడూ ప్రజలతో ఉంటూ వారి సమస్యలకు అండగా నిలిచేవారు. ఆ బాటలో నేనూ నడుస్తాను. ఎవరికి భయపడను, ప్రజలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.

Cyclone Montha Damage: తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక.. తక్షణమే సాయం చేయండి..

Exit mobile version