Site icon NTV Telugu

KTR: బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు..?

Ktr On Bandi Sanjay

Ktr On Bandi Sanjay

ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని, మతపరమైన వ్యక్తుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే బీజేపీ సహించదని, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించదని బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ‘‘బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే.. అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి’’ అని ఆయన నిలదీశారు. కాగా.. హిందూ ఏక్తా కార్యక్రమంలో బండి సంజయ్ తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వాలని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. శవాలొస్తే మీకు, శివలింగాలొస్తే మాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెలంగాణ తీవ్ర దుమారం రేపాయి.

Exit mobile version