Site icon NTV Telugu

KTR : బీసీలకు న్యాయం చేయగల పార్టీ ఒక్క బీఆర్‌ఎస్ మాత్రమే

Ktr

Ktr

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బీసీల హక్కుల విషయంలో కేసీఆర్‌ తప్ప మరెవ్వరూ నిజాయితీగా న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. పరకాలలోని లలితా కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టుమిషన్లు, కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, శంకర్‌ నాయక్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

సభలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవే రాజకీయ జీవితానికి ప్రాణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమాన్ని నిర్వహించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని అభినందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, “ఎక్కడ తులం బంగారం, ఎక్కడ రైతుబంధు రూ. 15 వేల రూపాయలు?” అని ప్రశ్నించారు. ప్రజలతో మోసపూరిత రాజకీయాలు చేస్తోందని రేవంత్‌ ప్రభుత్వంపై ఆరోపించారు.

వరంగల్‌ పద్మశాలీల సమస్యలను ప్రస్తావిస్తూ, “ఆజంజాహీ మిల్లు మూతపడిన తర్వాత వలసపోయిన కార్మికులను కేసీఆర్‌ స్వరాష్ట్రానికి తిరిగి తెప్పించేందుకు కృషి చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 1,500 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు,” అని కేటీఆర్‌ తెలిపారు. కేరళకు చెందిన కీటెక్స్‌ సంస్థ రూ. 2,400 కోట్ల పెట్టుబడి పెట్టిందని, దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌ వన్‌, గణేష్‌ ఎకోటెక్స్‌ సంస్థలు కూడా యూనిట్లు ప్రారంభించాయని గుర్తుచేశారు.

అయితే, ఈ టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఏర్పడిన అవకాశాలను కాంగ్రెస్‌ నేతలు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. “కీటెక్స్‌ సంస్థ 25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రకటించగా, కాంగ్రెస్‌ నేతలు బెదిరింపులు చేస్తున్నారు. పరిశ్రమలకు అడ్డంకులు పెడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు,” అని మండిపడ్డారు.

UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే పరిశ్రమలు నిలకడగా ఉంటాయని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. “కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌లో కాలువ నిర్మాణానికి 137 కోట్ల రూపాయల అంచనాలను కాంగ్రెస్‌ నేతలు 297 కోట్లకు పెంచారు. ఒక్క కాలువ నిర్మాణంలోనే వరంగల్‌ కాంగ్రెస్‌ నేతలు రూ. 167 కోట్లు దోచుకోవాలని చూశారు,” అని ఆరోపించారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. స్వయం సహాయక బృందాలకు 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది కానీ రేవంత్‌ ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు ఇచ్చింది,” అని విమర్శించారు. గృహలక్ష్మి పథకం కింద పరకాల నియోజకవర్గంలోని 3 వేల మంది లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం లేదని, దీనిపై కోర్టు కూడా స్పందించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

ఎరువుల సమస్యను ప్రస్తావిస్తూ, “కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎరువులు ముందుగానే కొనుగోలు చేసి బఫర్‌ స్టాక్‌ ఉంచేవారు. ఆయన పాలనలో ఎప్పుడూ రైతులు ఎరువుల కోసం క్యూల్లో నిలబడలేదు. కానీ రేవంత్‌ ప్రభుత్వం రైతులకు అవస్థలు కలిగిస్తోంది,” అని కేటీఆర్‌ విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “గులాబీ కండువా కప్పుకుని వచ్చే ప్రతి కార్యకర్తను కేసీఆర్‌ ప్రతినిధిగా భావించి ఆశీర్వదించండి,” అని ఆయన అన్నారు.

Bank Holiday: ఆగస్టులో ఏకంగా 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. లిస్ట్ ఇదే..

Exit mobile version