Koti Deepotsavam 2025 Day 2 : హైదరాబాద్‌లో భక్తి, ఆధ్యాత్మికతలతో కోటి దీపోత్సవం మహోత్సవం రెండవ రోజు కన్నుల పండుగగా సాగింది. ఎన్టీవీ–భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో వాతావరణాన్ని పవిత్రంగా మార్చారు. శ్రీవారి కళ్యాణం, తులసి అర్చన, మహాపూజలు, ఆశీర్వచనాలు భక్తుల మనసును తాకగా, ఆధ్యాత్మిక ఆరాధనతో నిండిన వేదికలో కార్తీకమాస భక్తి వైభవం మరింత ప్రకాశించింది.
కార్తీకమాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశించనిచ్చే సంకేతంగా భావిస్తారు. కోటి దీపోత్సోవంలో రెండవ రోజులో భాగంగా.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారిచే ప్రవచనామృతం వినిపించారు. తరువాత తలకాడు శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం శ్రీ గోవిందానంద సర్వతి స్వామిజీ వారిచే అనుగ్రహభాషణం భక్తులను అలరించింది. అంతేకాకుండా.. శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం పూజ్య శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామిజీచే ఆశీర్వచన కార్యక్రమం వైభవంగా సాగింది.

అయితే.. రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా సర్వారిష్టాలు నివారించే ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఇదే కాకుండా.. వేదికపై శ్రీవేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన, మొట్టమొదటిసారిగా తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామికి మహాపూజను భక్తులు తిలకించారు. భక్తులచే శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి తులసి అర్చన గావించారు.
కళ్యాణ అనంతరం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో రెండవ రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవతంగా ముగిసింది. ప్రతి దీపం ఒక భక్తుని ఆత్మజ్యోతి అనే భావనను ప్రతిబింబించిన ఈ కోటి దీపోత్సవం, కార్తీకమాస భక్తి వైభవానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈనెల 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..