Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్‌కు గవర్నర్ ఓకే..

  • గవర్నర్ ఆమోదంతో బర్తరఫ్ పూర్తి
  • రాజ్‌భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు
  • రెండు శాఖలకు కొత్త బాధ్యతలు?
  • కొండా దంపతుల నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Konda

Konda

Konda Surekha : తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారానికి తుది ఘట్టం పడింది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం పంపిన సిఫార్సు లేఖకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అధికారికంగా జీవో జారీ అయింది.

ముగిసిన ఉత్కంఠ.. వేగంగా పావులు కదిపిన ప్రభుత్వం

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలు, కొండా సురేఖ వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ తుది నిర్ణయం తీసుకుని, ఆ ఫైలును గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. పరిశీలన అనంతరం గవర్నర్ తక్షణమే ఆమోదం తెలపడంతో ఆమె బర్తరఫ్ ప్రక్రియ పూర్తయింది. కొండా సురేఖ బర్తరఫ్‌తో ఖాళీ అయిన దేవాదాయ, ధర్మాదాయ , అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలను ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంచుకోనున్నట్లు లేదా మరొక సీనియర్ మంత్రికి అదనపు బాధ్యతలుగా అప్పగించనున్నట్లు తెలిసింది.

కొండా వర్గం తదుపరి అడుగుపై ఉత్కంఠ

ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీ ద్వారా ఫిర్యాదులు పంపడం, మరోవైపు మీడియా ముందుకు వచ్చి ఘాటు వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాల మధ్య గవర్నర్ ఆమోదం రావడంతో కొండా సురేఖ తన మంత్రి పదవిని అధికారికంగా కోల్పోయారు. ఈ పరిణామంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగగా, కొండా సురేఖ దంపతులు తమ తదుపరి రాజకీయ ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.