ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది.
కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు. గజ్వేల్ లో ఉన్న ఫార్మా కంపెనీలను సహితం హైదరాబాద్ చుట్టూ పక్కలకు మార్చాలని చూస్తున్నారు. ఫార్మసీటికి 19 వేల ఎకరాలు ఒకే దగ్గర అవసరం లేదని తెలిపారు.
కిషన్ రెడ్డి మొదటి నుంచి వివాదరహితుడు.. సౌమ్యుడు.. అనేక సంవత్సరాలు కలిసి పనిచేసాం. కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ పెండింగ్ అంశాలు పూర్తి చేసేందుకు సహకరించాలని, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డిని కోరానన్నారు.
రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడు.. పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి.. రేవంత్ రెడ్డికి గురించి నా దగ్గర మాట్లాడవద్దన్నారు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పా.. అభివృద్ధిపైనే దృష్టి సారించాను. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మరే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్ధవంతమైన నాయకుడు లేడు, నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నా నియోజకవర్గ ప్రజలకు, నా జిల్లాకు, తెలంగాణకి అందుబాటులో ఉంటా, సేవ కార్యక్రమాలు చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా.. ఎవరి నియోజకవర్గం వారు గెలిపించుకుంటే అదే ఎక్కువ అని.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.