Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం

Komatireddy

Komatireddy

నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్లగొండ మండలం రాముల బండలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధి , సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

నల్లగొండ జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్బిసి స్వరంగం పనులపై మంత్రి స్పష్టతనిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించినప్పటికీ, దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, దాంతో పనులు నిలిచిపోయాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్లీ పనులను వేగవంతం చేశామని, ఇప్పటికే 18 మీటర్ల పని పూర్తయిందని తెలిపారు. 2028 జూన్ నాటికి ఈ స్వరంగ మార్గాన్ని పూర్తి చేసి, జిల్లా నుంచి ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పారద్రోలుతామని ఆయన భరోసా ఇచ్చారు.

17 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చెరువులను నింపుతున్నామని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో మరో రూ. 200 కోట్లు ఖర్చు చేసి, లైనింగ్ పనులు పూర్తి చేస్తామని, తద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

సాగునీటితో పాటు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. నల్లగొండ నుంచి మునుగోడుకు వెళ్లే రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తామని, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్‌మెంట్

Exit mobile version