Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మా‌వే.!

  • ఇందిర, వైఎస్సార్ తర్వాత రేవంతేనన్న మంత్రి
  • బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు
  • 2028 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్న హామీ
  • ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ధీమా
Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. నాడు ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డే సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరియు కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. కాలేశ్వరం, ధరణి పేరుతో దోపిడీ!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. పైగా, పశువులు తినే దాణా లాంటి నాసిరకం బియ్యాన్ని గత ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసిందని మండిపడ్డారు. “పోయిన దొర (కేసీఆర్) కనీసం రోడ్లకు పడిన గుంతలను కూడా పూడ్చలేదు. కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రోడ్లు, భవనాల శాఖకు భారీగా నిధులు కేటాయించింది. ఇల్లు దాటి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా, క్షేమంగా తిరిగి ఇంటికి చేరాలనే ఏకైక లక్ష్యంతో మేము రోడ్లను అధునాతనంగా అభివృద్ధి చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. టెండర్లు ఓపెన్ కాకముందే హ్యామ్ (HAM) రోడ్లలో స్కామ్ జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అసలు కాలేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ పేరుతో అడ్డంగా దోచుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.

బీఆర్ఎస్ కాస్త.. హరీష్ రావు రాష్ట్ర సమితి (HRS) అవుతుంది!

బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిణామాలు మరియు భవిష్యత్తుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని, ఆ పార్టీ కాస్త ‘హరీష్ రావు రాష్ట్ర సమితి’ (HRS) గా మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. జిల్లా అభివృద్ధి కోసం కలుస్తామని తాము ఎన్నోసార్లు అడిగినా కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని అహంకారి అని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సైతం నాపై కేసులు పెట్టించారని, అయినా తాము ప్రజాపక్షాన నిలబడ్డామని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ప్రభుత్వంపై ఎక్కువగా డిమాండ్లు పెట్టి ఇబ్బంది పెట్టబోనని మంత్రి పేర్కొన్నారు.

2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి.. మూసీ ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు

నల్లగొండ జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగ మార్గం ప్రాజెక్టును వచ్చే 2028 ఆగస్టు నాటికి వంద శాతం పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే జిల్లా ప్రజలకు సాగు, తాగు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మూసీ నది ప్రక్షాళనపై మాట్లాడుతూ.. “మూసీని శుద్ధి చేసి మాకు సాగు, తాగు నీళ్లు ఇవ్వమని ప్రజలెవరూ అడగలేదు. కానీ, ప్రజల భవిష్యత్తు, ఆరోగ్యం కోసం ఆలోచించే గొప్ప మనసున్న సీఎం కాబట్టే రేవంత్ రెడ్డి స్వయంగా ముందుండి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు” అని ప్రశంసించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.