Komatireddy Rajagopal Reddy Comments On CM KCR: మునుగోడు ఉపఎన్నికతో.. సీఎం కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సతీసమేతంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్‌ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక.. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం వచ్చే ఎన్నిక అని చెప్పారు. రాష్ట్రంలో 12 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించిన రాజగోపాల్.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని మునుగోడు ప్రజలను కోరారు. తాను బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం నిజాయితీగా పోరాటం చేస్తానని.. మునుగోడు ప్రజలే తన దేవుళ్లని, వాళ్ల తీర్పుని శిరసా వహిస్తానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా.. తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆగస్టు 21వ తేదీన మునుగోడులో నిర్వహించిన సమరభేరి కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే! ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర ప్రజల దృష్టిని తమ పార్టీవైపుకి తిప్పుకునేందుకు.. నేతలతో నిత్యం ప్రెస్‌మీట్లు, కార్యక్రమాలతో పాటు ఇతర వ్యూహాలను రచిస్తోంది. ఇంకా ఉప ఎన్నిక ఫోకస్ రాకపోయినప్పటికీ.. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రజల్ని కలుసుకుంటున్నారు.