ఇందిరా, పీవీలు ప్రధానిగా ఉన్నప్పుడు పేదలకు భూములు ఇచ్చారని జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాగీర్ దార్ల వద్ద 45 ఎకరాల కంటే ఎక్కువగా ఉండొద్దని చట్టం ఉందని, గతంలో.. 48 లక్షల ఎకరాల భూమిని పంపిణి చేశారన్నారు. అంతేకాకుండా ఆ భూమిని.. కేవలం వ్యవసాయం చేసుకోవాలి, అమ్ముకోడానికి వీలులేదని క్లాజ్ పెట్టారన్నారు. అంత సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. వైఎస్సార్ కూడా తన తండ్రి కొన్నభూమిని తిరిగి ఇచ్చేశారని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ చట్టాలు ఆగమయ్యాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అసైన్డ్ భూములపై కన్ను పడిందని, నిషేదిత జాబితాను చేర్చి 24లక్షల ఎకరాల భూమిని పెట్టారన్నారు.
నిషేదిత జాబితాను తొలగించాలని కోరిన పట్టించుకోవడం లేదని, అన్ని జిల్లాల్లో నిషేదిత భూమిని అధికారులే తెల్లకాగితాలపై రాయించుకోవడం దారుణమన్నారు. ఈటల మంత్రిగా ఉన్నపుడు.. తన అవసరానికి అసైన్డ్ భూమిని రాయించుకున్నారని, ఈటెల బర్తరఫ్ చేయడంలో దాన్నే కీలకంగా చేసిండు కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. హెచ్ఎండీఏ ను ముందు పెట్టుకుని అసైన్డ్ ల్యాండ్ అమ్మకానికి పెడుతున్నారని, గజానికి 30నుండి 40వేలకు అమ్ముతున్నారని, ప్రైవేట్ వ్యాపారస్తుల తరహాలో హెచ్‌ఎండీఏ పనిచేస్తుందన్నారు.