Site icon NTV Telugu

Kodanda Reddy : 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడు

Kodanda Reddy

Kodanda Reddy

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడన్నారు. కేసీఆర్ సర్కార్ రైతు కష్టాలను పట్టించుకోలేదని, కరోనా సమయంలో కూడా రైతులు నిరంతరం పనిచేశారన్నారు. రైతులకు కరోనా కష్టాలు వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ సంవత్సరం ప్రభుత్వం వడ్లు కొనక రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారన్నారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫి హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. 7095 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు అంకెల గారడీకే పరిమితం అయ్యాయన్నారు.
Also Read : Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలకి చెక్ పెట్టే గొప్ప ఔషధం

భూ రికార్డ్‌ల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలం అయిందని, ధరణి పోర్టల్‌తో భూస్వాములకు న్యాయం జరిగిందన్నారు. చిన్నా సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతోందని, వ్యవసాయం చేయని భూములకు కూడా రైటుబంధు సాయం అందుతోందన్నారు. పంట నష్ట పరిహారం అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఆయన ధ్వజమెత్తారు. పోడు భూముల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఎంతో మంది ఆదివాసీలను పోలీసులు జైల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ ఇప్పుడు దేశంలో ఏదో చేస్తానని చెబుతున్నాడని, ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. కేసీఆర్ జాతీయ పార్టీ ఒక అత్యాశ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

Exit mobile version