హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై వాదనలు సమర్థవంతంగా వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. “కేంద్ర మంత్రిగా నేను ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతిగారు కూడా ఏం చేయలేరు,” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఎన్నికల తర్వాత బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
“అసలు రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే కాంగ్రెస్ గతంలో సుప్రీంకోర్టులో ఆ క్యాప్‌కి వ్యతిరేకంగా వాదించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో కూడా అదే తప్పును మళ్లీ చేసింది,” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. “బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుంది.” అని ఆయన స్పష్టం చేశారు.
“జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం మూడు పేర్లను జాతీయ నాయకత్వానికి పంపించాం. పార్లమెంటరీ బోర్డ్ సమావేశం తర్వాత అభ్యర్థి పేరును ప్రకటిస్తాం,” అని చెప్పారు కిషన్ రెడ్డి..
