తెలంగాణలో రాజకీయ వేడి పెరగుతోంది. వరసగా జాతీయ నాయకులు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే… రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తే… తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుక్కుగూడ లో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇరు పార్టీలు పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌజ్ సీఎం, ఆయన కుటుంబానికి గత కొన్ని ఏళ్లుగా ప్రపంచాన్ని కరోనా వణికించిన సంగతి మరిచిపోయారేమో అని ఎద్దేవా చేశారు.
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఆయన అన్నారు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే యునికార్న్‌లకు భారత్ నిలయం అన్నారు. ఈ ఏడాది ఒక్క ఎప్రిల్ లోనే 8.8 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని వెల్లడించారు. ఫామ్ హౌజ్ కుటుంబం ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఇది వాస్తవం అని కిషన్ రెడ్డి అన్నారు. టీకా కవరేజ్ లో, ఆరోగ్య సంరక్షణ కవరేజ్, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కవరేజ్ భారత్ తన సత్తా కనబర్చిందని అన్నారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ టాప్ లో ఉందని వెల్లడించారు. తక్కువ ద్రవ్యోల్బనం ఉన్న దేశాల్లో, కరెన్సీ విలువ తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కిషన్ రెడ్డి అన్నారు.