Kishan Reddy : “మనమందరం ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రోజు నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలి” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడింటిలో బీజేపీ జెండా ఎగురవేసి సగర్వంగా తెలంగాణకు వస్తున్న ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నితిన్ నబీన్‌కు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
దారుసలాం నుండే నగర పాలన.. మజ్లిస్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ కొమ్ముకాపు
హైదరాబాద్ నగరం ప్రస్తుతం మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఏ అధికారులు ఉండాలో, ఎవరు ఎక్కడ పని చేయాలో సెక్రటేరియట్ నుండి కాకుండా దారుసలాం నుండి వచ్చే ఆదేశాలే నిర్ణయిస్తున్నాయని మండిపడ్డారు. ఈ దారుణమైన పరిస్థితి మారాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు గతంలో బీఆర్ఎస్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చారని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసి మజ్లిస్ పార్టీకే కొమ్ముకాశాయని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 50 శాతం స్థానాలు (8 మంది ఎంపీలు) అందించి మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచారని, అదే నమ్మకంతో రాష్ట్రంలోనూ మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
‘సర్’ కు ఎందుకంత భయం?
నగరంలో , రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘సర్’ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మజ్లిస్ పార్టీ వైఖరిని కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. “సర్ వస్తుందంటే మజ్లిస్ పార్టీ ఎందుకు అంతగా భయపడుతోంది? పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, ఇతర అక్రమ వలసదారుల ఓట్లు ఎక్కడ తొలగిపోతాయోనని వారికి వణుకు పుడుతోంది” అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మీద నమ్మకం లేకపోవడం శోచనీయమన్నారు. ఈ ప్రక్రియలో పనిచేసేది కేంద్ర అధికారులు కాదు, తెలంగాణ ఉద్యోగులేనని గుర్తుచేశారు. గత 2002 లో ఇలాంటి సర్వే జరిగినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ భాగస్వామ్యమే ఉందని, నాడు లేని భయం ఈ రోజు ఎందుకు అని నిలదీశారు. పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు అక్రమ వలసదారులు మనవాళ్లపై అరాచకాలు చేశారని, కానీ అక్కడ బీజేపీ పట్టు సాధించాక వారంతా తోకముడిచి బంగ్లాదేశ్ పారిపోతున్నారని వివరించారు. నగర రక్షణ కోసం ‘సర్’ లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, దీనిని అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
రేషన్ కార్డులు పోతాయంటూ కాంగ్రెస్ బెదిరింపులు.. బోనస్‌పై ఎగనామం!
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. “ఒకవేళ మీ ఓటు హైదరాబాద్‌లో ఉంటే గ్రామాల్లో రేషన్ కార్డులు, పింఛన్లు పోతాయంటూ కాంగ్రెస్ నాయకులు అమాయక ప్రజలను బెదిరిస్తున్నారు. ఓటు హక్కుకు, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. దీనివల్ల ఎవరి కార్డులు కట్ అవ్వవు” అని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలంతా బీఎల్ఓ (BLO)లతో కలిసి తిరిగి ప్రజల ఓటు హక్కును కాపాడాలని సూచించారు.
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ.. “మొదట వరి పంట మొత్తానికి బోనస్ ఇస్తామన్నారు.. ఆ తర్వాత మాట మార్చి కేవలం సన్న వడ్లకే అన్నారు.. ఇప్పుడు ఆ సన్న వడ్ల బోనస్‌కు కూడా ఎగనామం పెట్టాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి.. మొదట మీరు ప్రకటించిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పండి. ఆ తర్వాత కేంద్రం ఏం ఇచ్చింది, ఎంపీ ఏం తెచ్చారో అడగండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం తెచ్చిందో లెక్కలతో సహా చెప్పడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం” అని సవాల్ విసిరారు.
ట్రై-కార్పొరేషన్‌లో క్లీన్ స్వీప్ చేయాలి
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. రానున్న ట్రై-కార్పొరేషన్ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో తిరగాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి బాధ్యతగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

