Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్‌చల్.. ఖమ్మంలో కలకలం.!

  • నిమజ్జన ఊరేగింపులో తల్వార్లతో యువకుల హంగామా
  • వైరల్‌గా మారిన కత్తులతో డ్యాన్సుల వీడియో
  • నిబంధనలు ఉల్లంఘించారంటూ స్థానికుల ఆగ్రహం
  • పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
Sword Dance

Sword Dance

Sword Dance : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్‌లో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా తీవ్ర కలకలం రేగింది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో కొందరు యువకులు బహిరంగంగా తల్వార్లు, పెద్ద పెద్ద కత్తులు చేతబూని రోడ్లపై హల్‌చల్ చేశారు. ప్రజాభద్రతను గాలికి వదిలేసి, చేతుల్లో పదునైన ఆయుధాలు పట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్.. స్థానికుల్లో భయం

పెద్ద ఎత్తున కత్తులు తిప్పుతూ, నృత్యాలు చేస్తూ రోడ్లపై సంచరించిన ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వేగంగా వైరల్‌గా మారాయి. పదునైన తల్వార్లను ప్రదర్శిస్తూ యువకులు చేసిన ఈ చర్యలతో స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆధ్యాత్మిక ఉత్సవాల పేరిట ఇలా బహిరంగంగా ఆయుధాలతో హంగామా చేయడం ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం.. పోలీసుల తీరుపై ప్రశ్నలు

నిమజ్జన సమయంలో డీజేల వినియోగానికి ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ, అక్కడ యథేచ్ఛగా డీజేలు మోగిస్తూ ఊరేగింపు నిర్వహించడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ, అంతటి పెద్ద సౌండ్ సిస్టమ్‌లు , పదునైన ఆయుధాలతో యువకులు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తుంటే రఘునాథపాలెం పోలీసులు పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.