Khammam Cyber Fraud : ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన వెయ్యి కోట్ల రూపాయల ఫైబర్ చీటింగ్, సైబర్ మోసాల కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ భారీ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తీవ్రత , వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని, దర్యాప్తు బాధ్యతలను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అప్పగించారు. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ విచారణను వేగవంతం చేసింది.
సిట్ పరిధిలోకి వి.ఎం. బంజారా, సత్తుపల్లి కేసులు
ఖమ్మం జిల్లా పరిధిలోని వి.ఎం. బంజారా , సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి విస్తృత విచారణ ప్రారంభించింది. ప్రతి వారం దర్యాప్తు పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని డీజీపీ ఆదేశించారు. ఈ కేసులో విదేశీ లింకులు, అంతర్రాష్ట్ర మనీలాండరింగ్, బ్యాంకు లావాదేవీల కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.
నిరుద్యోగులే లక్ష్యంగా వందల కోట్ల దందా
ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి ఈ ముఠా దారుణమైన మోసానికి పాల్పడింది. బాధితుల పేర్లపై రకరకాల బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, ఆ ఖాతాల ఎటిఎం కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ల పూర్తి నియంత్రణను నిందితులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సైబర్ మోసాల ద్వారా దోచుకున్న రూ. 1,000 కోట్లకు పైగా సొమ్మును బదిలీ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
వెలుగులోకి ప్రధాన నిందితుల పేర్లు
ఈ భారీ చీటింగ్ నెట్‌వర్క్‌లో పోత్రు ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అతనితో పాటు పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్ తదితరులను నిందితులుగా చేర్చారు. ఇప్పటికే కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిందితులకు సహకరించిన వ్యక్తులు, బోగస్ కంపెనీలు, సహకరించిన బ్యాంకర్ల నెట్‌వర్క్‌పై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్యాప్తు ముమ్మరం కావడంతో ఈ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

